బ్రియాన్ లారాపై వేటు.. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా వెటోరీ

  • 2024 సీజన్‌లో సన్ రైజర్స్ ప్రధాన కోచ్‌గా వెటోరీ
  • గత సీజన్‌లో 14 మ్యాచ్‌లకు గాను నాలుగింట మాత్రమే గెలుపు
  • లారాను తొలగించి, వెటోరీని నియమించినట్లు ట్వీట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఐపీఎల్ 2024 సీజన్‌కు గాను తన కొత్త ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో వెటోరీ ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా స్థానంలో వెటోరీ తదుపరి సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ పట్టికలో దిగువ స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేదు. గత ఏడాది 14 మ్యాచ్‌లలో నాలుగింట మాత్రమే గెలిచింది. దీంతో 2024లో జట్టు మెరుగైన ప్రదర్శన కోసం కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా లారాను తొలగించి, వెటోరీని నియమించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. సన్ రైజర్స్‌కు వెటోరీ నాలుగో హెడ్ కోచ్. అతని కంటే ముందు టామ్ మూడీ, ట్రేవర్ బెలీస్, లారా ప్రధాన కోచ్‌లుగా వ్యవహరించారు. వెటోరీ 2014 నుండి 2018 వరకు బెంగళూరుకు కోచ్‌గా పని చేశారు.


More Telugu News