మణిపూర్ ఘటనలపై ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తులతో కమిటీ నియామకం

  • జాతిహింస కేసుల్లో పునరావాసం, ఇతర అంశాలను పర్యవేక్షణకు కమిటీ
  • చట్టబద్ధమైన పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలన్న సుప్రీం కోర్టు
  • కమిటీలో జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ షాలిని పీ జోషి, జస్టిస్ ఆశామీనన్
మణిపూర్‌లో జరిగిన జాతిహింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుతో పాటు పునరావాసం, ఇతర అంశాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. కేవలం హింసాత్మక ఘటనలపై విచారణ చేయడమే కాదు.. ఈ కమిటీ పరిధి విస్తృతంగా ఉంటుంది. పర్యవేక్షణకు నియమించిన ముగ్గురూ మాజీ మహిళా న్యాయమూర్తులే. జమ్ము కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలోని ఈ కమిటీలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిని పీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నారు.

రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. 

మణిపూర్ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై గతవారం సుప్రీం ధర్మాసనం కోరిన నివేదికను అందించారు. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ రాజీవ్ సింగ్ ధర్మాసనం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో హింస, వాటి నివారణకు ఇప్పటి వరకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను సుప్రీం కోర్టుకు వివరించనున్నారు.


More Telugu News