లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడంపై 'ఆప్' గుజరాత్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

  • I.N.D.I.A. కూటమిలో సభ్యులుగా ఉన్నందున పొత్తు ఉండవచ్చన్న గుజరాత్ ఆప్ చీఫ్
  • సీట్ల షేరింగ్ ఫార్ములాతో ముందుకు సాగుతామని వెల్లడి
  • భిన్నంగా స్పందించిన గుజరాత్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీతో పాటు తమ పార్టీ ప్రతిపక్ష కూటమి I.N.D.I.A.లో సభ్యులుగా ఉన్నందున వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు ఇసుదన్ గధ్వి సోమవారం తెలిపారు. సీట్ల షేరింగ్ ఫార్ములాతో ముందుకు సాగుతామని చెప్పారు. అయితే దీనిపై గుజరాత్ కాంగ్రెస్ వెంటనే స్పందించింది. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాలకు గుజరాత్ కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఆప్ సీట్ల షేరింగ్‌తో కలిసి సాగుదామని చెప్పగా, అధిష్ఠానం నిర్ణయం ప్రకారం వెళ్తామని కాంగ్రెస్ చెప్పింది.

ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు తమ ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం ప్రభావం చూపదని కమలం పార్టీ తెలిపింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ కాంగ్రెస్‌కు బీ-టీమ్‌గా అభివర్ణించింది.

'I.N.D.I.A. కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి గుజరాత్‌లో పొత్తు ఉండే అవకాశముంది. పొత్తుపై చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కలిసి పోరాడవచ్చు. గుజరాత్‌లో సీట్ల పంపకాలతో ముందుకు సాగుతాం' అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత గధ్వి ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసారి గుజరాత్‌లో బీజేపీ గెలవదన్నారు. తాము ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై పార్టీలో ఇప్పటికే చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు వ్యాఖ్యలపై గుజరాత్ కాంగ్రెస్ మాత్రం భిన్నంగా స్పందించింది. తుది నిర్ణయం అధిష్ఠానానిదే అని తెలిపింది.


More Telugu News