ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు... గద్దర్ చివరి కోరిక ఏంటంటే...!

  • తీవ్ర అనారోగ్యంతో గద్దర్ మృతి
  • ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు భౌతికకాయం తరలింపు
  • రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు
  • సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్
తన పాటతో తెలంగాణ జనాల్లో చైతన్యం రగిల్చి, వారిని ఉద్యమం దిశగా నడిపించిన ప్రజా గాయకుడు గద్దర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

గద్దర్ జీవితాంతం చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవసూచకంగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, అందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సీఎస్ శాంతికుమారికి స్పష్టం చేశారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. 

గద్దర్ అంత్యక్రియలు అక్కడే!

కాగా, గద్దర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాదు నగరంలోని ఎల్బీ స్టేడియంకు తరలించారు. రేపు మధ్యాహ్నం తర్వాత గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక్కడే అంత్యక్రియలు జరిపించాలన్నది గద్దర్ కోరిక అని ఆయన తనయుడు వెల్లడించారు. గద్దర్ అర్ధాంగి విమల కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.


More Telugu News