‘క్విట్ ఇండియా’ నినాదంతో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు
- అవినీతి, వారసత్వం దేశం నుంచి వెళ్లిపోవాలన్న మోదీ
- ప్రతిపక్షాలు ‘నెగటివ్ పాలిటిక్స్’ చేస్తున్నాయని మండిపాటు
- ‘పని చెయ్యము.. పని చేయనివ్వము’ అనే సిద్ధాంతంతో పని చేస్తున్నాయని ఆరోపణ
ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు దేశం నుంచి వెళ్లిపోవాలని (క్విట్ ఇండియా) అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాని మాట్లాడారు.
‘‘అవినీతి, వారసత్వం, బుజ్జగింపు రాజకీయాలు వెళ్లిపోవాలని.. క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఇప్పుడు దేశం మొత్తం చెబుతోంది” అని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు ‘నెగటివ్ పాలిటిక్స్’ చేస్తున్నాయని మండిపడ్డారు. ‘తాము పని చెయ్యము.. ఇతరులను పని చేయనివ్వము’ అనే సిద్ధాంతంతో కొన్ని ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని ఆరోపించారు.
‘‘ప్రతికూల రాజకీయాలకు అతీతంగా.. అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సానుకూల రాజకీయాల బాటలో మేం పయనిస్తున్నాం. ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టి భారతదేశంపైనే ఉంది. ‘అభివృద్ధి చెందిన దేశం’గా మారాలనే లక్ష్యంతో దేశం దూసుకెళ్తోంది. భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది” అని అన్నారు.