కోతులు తరమడంతో బావిలో పడ్డ వృద్ధురాలు.. తర్వాత ఏమైందంటే?

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  • నడుముకు తాడుకట్టి బయటకు తీసుకొచ్చిన యువకులు
  • కోతుల బెడద తప్పించాలని గ్రామస్థుల వినతి
కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. రక్షించాలంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఓ యువకుడు ధైర్యంగా బావిలోకి దిగి, వృద్ధురాలిని పైకి చేర్చాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

బొప్పాపూర్ గ్రామానికి చెందిన గంభీర్ పూర్ రాజవ్వ అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. భర్త చనిపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న వితంతు పెన్షన్ డబ్బులతో జీవనం కొనసాగిస్తోంది. ఇటీవల గ్రామంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. రాజవ్వ ఇంటిచుట్టూ ఉన్న చెట్లపైకి కోతులు చేరాయి. శనివారం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రాజవ్వపై దాడికి ప్రయత్నించాయి. దీంతో రాజవ్వ భయపడి పరిగెత్తింది. ఈ క్రమంలో చూసుకోకుండా బావిలో పడిపోయింది.

భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని బావిలో పడ్డ రాజవ్వకు ధైర్యం చెప్పారు. ఓ యువకుడు బావిలోకి దిగి రాజవ్వ నడుముకు తాడు కట్టాడు. పైనున్న యువకులు రాజవ్వను జాగ్రత్తగా పైకి తీశారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన రాజవ్వకు స్థానిక ఆర్ఎంపీ చికిత్స చేసి ధైర్యం చెప్పారు. కాగా, గ్రామంలో ఇటీవల కోతుల బెడద తీవ్రంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నామని, వాటి నుంచి రక్షించాలని అధికారులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


More Telugu News