205 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. భయంతో బిక్కచచ్చిపోయిన ప్రయాణికులు

  • అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఘటన
  • శాన్‌డస్కీలోని అమ్యూజ్‌మెంట్‌పార్క్‌లో  నిలిచిపోయిన రోలర్‌కోస్టర్
  • చిక్కుకుపోయిన వారిని జాగ్రత్తగా కిందికి దించిన వైనం
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఓ రోలర్‌కోస్టర్ 205 అడుగుల ఎత్తులో అకస్మాత్తుగా ఆగిపోయింది. రైడ్ ఎంజాయ్ చేద్దామని దానిపైకి ఎక్కినవారు భయంతో హడలిపోయారు. శాన్‌డస్కీలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో జరిగిందీ ఘటన. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రోలర్‌కోస్టర్‌ను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పైన చిక్కుకున్న వారిని జాగ్రత్తగా కిందికి దింపారు. ఈ  ఘటనలో అందరూ క్షేమంగా ఉండడంతో పార్క్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

మాగ్నమ్ ఎక్స్ఎల్-200గా పిలిచే ఈ రోలర్‌కోస్టర్‌ను 1989లో ప్రవేశపెట్టారు. 200 అడుగుల పొడవును అధిగమించి ప్రపంచంలోనే అతిపొడవైన రోలర్‌కోస్టర్‌గా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. 420 అడుగుల పొడవైన టాప్ థ్రిల్ డ్రాగ్‌స్టర్‌ సహా సెడార్ పాయింట్ దాని సొంత రికార్డును రెండుసార్లు తిరగరాసింది. అయితే, ఆ తర్వాత రికరింగ్ సమస్యల కారణంగా రెండుసార్లు మూతపడింది. తాజాఘటనతో రోలర్‌కోస్టర్‌ను గురువారం వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. రోలర్‌కోస్టర్‌లలో ఇటీవల ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. విస్కాన్సిన్ ఫెస్టివల్‌లలో డోలనం చేసే ఫైర్‌బాల్‌లో ప్రయాణికులు గాల్లో గంటల తరబడి తలకిందులుగా ఇరుక్కుపోయారు.


More Telugu News