ఇంకొక్క కేసు నమోదైతే చాలు.. గెలుపు నాదే!: డొనాల్డ్ ట్రంప్

  • తనను వేధిస్తున్న వారిని వదలబోనన్న మాజీ అధ్యక్షుడు
  • ట్రూత్ సోషల్ లో ఈమేరకు హెచ్చరికలతో పోస్ట్
  • న్యాయవాదితో పాటు ఇద్దరు అటార్నీలపై బెదిరింపుల ప్రకటన
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఆరోపించారు. తనపై కుట్రపూరితంగా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న వారిని ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. న్యాయవాదులు, అటార్నీలు, సాక్షులు.. ఇలా తనపై నమోదైన కేసులతో సంబంధం ఉన్న వారు ఎవరైనా సరే వదలబోనని హెచ్చరించారు. ఈమేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ఓ పోస్టు పెట్టారు. దీంతోపాటు ప్రభుత్వ న్యాయవాది జాక్ స్మిత్ తో పాటు మరో ఇద్దరు అటార్నీలపై బెదిరింపులతో కూడిన ప్రకటనను టీవీలో ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ వాణిజ్య ప్రకటన సోమవారం వాషింగ్టన్, న్యూయార్క్, అట్లాంటా సిటీలతో పాటు జాతీయ కేబుల్ నెట్ వర్క్ లో ప్రసారం అవుతుందని సమాచారం. కాగా, బైడెన్ సర్కారు పెడుతున్న తప్పుడు కేసులు తనకే లాభం చేకూరుస్తున్నాయని ట్రంప్ చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్న ప్రతిసారీ తనకు ప్రజాధరణ పెరుగుతోందని వివరించారు. ఇదే ఊపులో తనపై మరో కేసు నమోదైతే చాలు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News