చాట్‌జీపీటీ ఎంతపనిచేశావే.. 90 శాతం తగ్గిన ఫ్రీలాన్సర్ ఆదాయం!

  • 22 ఏళ్ల విద్యార్థిని శరణ్యకు చేదు అనుభవం
  • చాట్‌జీపీటీ కారణంగా పని ఇవ్వడం మానేసిన సంస్థ
  • ఆదాయం తగ్గిపోవడంతో చుట్టుముట్టిన కష్టాలు
కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదకరమన్న వార్తలు ప్రతి రోజూ వినిపిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలకు ఎసరు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనిని నిజం చేసే ఘటన ఒకటి కోల్‌కతాలో జరిగింది. చాట్‌జీపీటీ కారణంగా తన జీవితం ఎలా తలకిందులైందీ వివరిస్తూ 22 ఏళ్ల విద్యార్థిని శరణ్య భట్టాచార్య సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయింది.

డిగ్రీ పూర్తిచేసిన శరణ్య స్థానికంగా క్రియేటివ్ సొల్యూషన్స్ ఏజెన్సీకి కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్ చేస్తోంది. అలా నెలకు వచ్చే రూ. 20 వేలతో చదువును కొనసాగించడంతోపాటు ఇంటికి కూడా డబ్బులు పంపేది. అయితే, చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. ఆమె ఫ్రీలాన్సింగ్ చేస్తున్న సంస్థ ఆమెకు పని ఇవ్వడం పూర్తిగా తగ్గించేసింది.

నెలకు ఒకటి, రెండు కథనాలు మాత్రమే ఇస్తుండడంతో ఆదాయం బాగా తగ్గిపోయింది. తాను చేయాల్సిన పనిని చాట్‌జీపీటీలో చేయించుకుంటున్నారని అర్థం చేసుకుంది. ఆ కారణంగా తనకు తక్కువ పని ఇస్తారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇప్పుడు తనకు డబ్బులు సరిపోవడం లేదని, ఇంటిదగ్గర చీరలు విక్రయించి జీవించే తన తల్లిని డబ్బులు అడగడం బాధగా ఉందని చెప్పుకొచ్చింది. యంత్రాలు చేసే పనికి, మనుషులు చేసే పనికి చాలా తేడా ఉంటుందని, కాబట్టి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని వేడుకుంది. లేదంటే చాలామంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News