రేసింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రమాదం.. 13 ఏళ్ల రేసర్ హరీశ్ మృతి

  • చెన్నైలో జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌
  • చిన్నతనంలోనే రేసింగ్‌లో అడుగుపెట్టిన హరీశ్
  • జాతీయస్థాయిలో పలు పతకాలు
  • హరీశ్ మృతితో మిగిలిన రేసింగులను నిలిపివేసిన ఎంఎంఎస్సీ
చెన్నైలో నిన్న జరిగిన జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల రేసర్ శ్రేయాస్ హరీశ్ మృతి చెందాడు. మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో నిన్న పోల్ పొజిషన్‌కు అర్హత సాధించిన హరీశ్ రూకీ రేసులోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో మూడో రౌండ్‌లో అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. నిర్వాహకులు వెంటనే రేసును ఆపేసి శ్రేయాస్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

శ్రేయాస్ మృతితో రేసింగ్‌లో ఒక్కసారిగా విషాదం అలముకుంది. శ్రేయాస్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. ప్రతిభావంతుడైన రైడర్‌ను కోల్పోయామని ఎంఎంఎస్సీ ప్రెసిడెంట్ అజిత్ థామస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో జరగాల్సిన మిగిలిన రేసింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి రేసింగ్‌పై మక్కువ పెంచుకున్న హరీశ్ జాతీయస్థాయికి ఎదిగి పలు పోటీల్లో విజేతగా నిలిచాడు. 

ఈ సీజన్‌లోనే పెట్రోనాస్ టీవీఎస్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రేసుల్లో విజేతగా నిలిచి రైజింగ్ స్టార్‌గా ఎదిగాడు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మినీజీపీ ఇండియా టైటిల్ పోరులో శ్రేయాస్ విజయం సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన ఇవే పోటీల్లో 4,5 స్థానాల్లో నిలిచాడు. కాగా, మద్రాస్‌లోని ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన ఎంఆర్ఎఫ్ ఎంఎంఎస్సీ ఎఫ్ఎంఎస్సీఐ ఇండియన్ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్ 2022లో 59 ఏళ్ల కేసీ కుమార్ కూడా ప్రమాదానికి గురై జనవరిలో చనిపోయాడు.


More Telugu News