విష్ణువు కొత్తగా ఆలోచించబట్టే హిరణ్యకశిపుడ్ని చంపగలిగాడు: ఆనంద్ మహీంద్రా

  • హైదరాబాదులో మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవం
  • వర్సిటీ  చాన్సలర్ హోదాలో హాజరైన ఆనంద్ మహీంద్రా
  • విద్యార్థులకు అత్యంత స్ఫూర్తిదాయక సూచనలు
  • కొత్తగా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని స్పష్టీకరణ
హైదరాబాదులోని మహీంద్రా యూనివర్సిటీ ద్వితీయ వార్షిక స్నాతకోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వర్సిటీ  చాన్సలర్ హోదాలో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి అత్యంత స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. 

విద్యార్థులు తమను తాము కొత్తగా  ఆవిష్కరించుకోవాలని, వినూత్నంగా ఆలోచించడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇది హైబ్రిడ్ ప్రపంచం అని, సాదాసీదాగా ఆలోచించడానికి ఇవి రోజులు కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీమహావిష్ణువు నారసింహావతారంలో హిరణ్యకశిపుడ్ని అంతమొందించడాన్ని ప్రస్తావించారు. 

హిరణ్యకశిప్నుడ్ని చంపడానికి విష్ణువు వినూత్నంగా ఆలోచించబట్టే విజయం సాధించగలిగాడని ఆనంద్ మహీంద్రా సోదాహరణంగా వివరించారు. 

"హిరణ్యకశిపుడు వర బలంతో మదించిపోయాడు. అతడికున్న వరం ఏంటంటే.... ఓ వ్యక్తి వల్ల కానీ, ఓ మృగం వల్ల కానీ అతడికి మరణం లేదు. పగలు కానీ, రాత్రి కానీ అతడిని చంపలేరు. ఇంట్లో కానీ, ఇంటి వెలుపల కానీ అతడిని మృత్యువు తాకలేదు. భూమ్మీద కానీ, ఆకాశంలో కానీ అతడిని హతమార్చలేరు. ఇది ఎంత సంక్లిష్టమైన పరిస్థితో చూడండి. ఇక్కడే విష్ణుమూర్తి కొత్తగా ఆలోచించాడు. 

ముందు... వరంలో ఉన్న లొసుగును గుర్తించాడు. ఆపై తనను తాను సగం మనిషి, సగం సింహంగా మార్చుకున్నాడు. అప్పుడాయన మనిషి కాడు, అలాగని పూర్తిగా మృగం కాడు. అదే నారసింహావతారం. దాంతో హిరణ్యకశిపుడి వరం నారసింహావతారం ముందు నిర్వీర్యం అయింది. ఆ విధంగా బ్రహ్మ వరంతో అజేయుడు అనుకున్న హిరణ్యకశిపుడ్ని నారసింహుడు కడతేర్చాడు" అని ఆనంద్ మహీంద్రా వివరించారు. 

ఈ కథ నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో డిజిటల్ హవా నడుస్తోందని, దీనికి అనుగుణంగా విద్యార్థులు విభిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలని సూచించారు. 

"వర బలంతో విర్రవీగుతున్న హిరణ్యకశిపుడ్ని చంపాలి అనుకున్నప్పుడు విష్ణుమూర్తి సరళంగా ఆలోచించడాన్ని వదిలేశాడు. బుర్రకు పదునుపెట్టి కొత్త ఆలోచన చేయడమే అసలైన ఆటకు ప్రారంభం. ఇక్కడ సున్నితమైన నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యమైనవి. కొత్త సవాళ్లను అధిగమించాలంటే నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండాల్సిందే" అని పిలుపునిచ్చారు. 

కాగా, మహీంద్రా యూనివర్సిటీ ద్వితీయ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు హాజరయ్యారు. గౌరవ అతిథిగా యూటీవీ అధినేత రోనీ స్క్రూవాలా హాజరయ్యారు.


More Telugu News