భారత మహిళల ఆర్చరీ బృందం చరిత్ర సృష్టించడంపై ప్రధాని మోదీ స్పందన 

  • జర్మనీలో ఆర్చరీ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలు
  • మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్ కు స్వర్ణం
  • భారత్ కు తొలిసారిగా బంగారు పతకం
  • భారత అమ్మాయిల జట్టుపై అభినందన జడివాన
జర్మనీలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ లో భారత మహిళల బృందం చరిత్ర సృష్టించడం తెలిసిందే. ప్రపంచ చాంపియన్ షిప్ లో భారత ఆర్చరీ మహిళల కాంపౌండ్ టీమ్ స్వర్ణం సాధించింది. ఆర్చరీ వరల్డ్ చాంపియన్ షిప్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి పసిడి పతకం. 

ప్రపంచ ఆర్చరీలో ఇన్నేళ్ల కరవును తీర్చుతూ... తెలుగమ్మాయి వెన్నం జ్యోతిసురేఖ, అదితి గోపీచంద్ స్వామి, ప్రణీత్ కౌర్ లతో కూడిన భారత జట్టు ఫైనల్లో మెక్సికోను ఓడించింది. దేశానికి అపురూప విజయాన్ని అందించిన భారత మహిళల ఆర్చరీ టీమ్ పై అభినందనల వర్షం కురుస్తోంది. 

తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారత మహిళా ఆర్చర్ల అద్వితీయ ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ లో భారత్ కు తొలిసారిగా బంగారు పతకాన్ని అందించారు... మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది అంటూ ప్రశంసా వాక్యాలు పలికారు. మీ అమోఘమైన కృషి, మీ అకుంఠిత దీక్ష ఫలితమే ఈ అద్భుత విజయం అని ప్రధాని మోదీ కొనియాడారు.


More Telugu News