ఆర్టీసీ బిల్లు వివాదం: రాజ్ భవన్ ను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

  • బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ నినాదాలు
  • రాజ్ భవన్ వద్ద భద్రత పెంచిన ప్రభుత్వం
  • కార్మిక సంఘాల లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళిసై చర్చలు
తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ను ముట్టడించారు. నెక్లెస్ రోడ్ మీదుగా ర్యాలీగా వచ్చిన వేలాది మంది కార్మికులు రాజ్ భవన్ ముందు బైఠాయించారు. బిల్లుపై సంతకం చేసి ప్రభుత్వానికి పంపించాలని నినాదాలు చేస్తున్నారు. బిల్లులో అంశాలపై వివరణ సంగతి తర్వాత చూడొచ్చు ముందు బిల్లుకు ఆమోదం తెలపాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు.

కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ఉదయం ట్విట్టర్ లో వెల్లడించారు. ఆర్టీసీ బిల్లుకు సంబంధించి ఐదు అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు ప్రభుత్వం వివరణ పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కార్మిక సంఘాల చర్చల తర్వాత ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండడంతో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో ఆర్టీసీ బిల్లును పాస్ చేయించాలని ప్రయత్నిస్తోంది.


More Telugu News