ల్యాప్ టాప్ దిగుమతులపై ఆంక్షల అమలు వాయిదా.. ఎప్పటి నుంచి అంటే!

  • నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపిన కేంద్రం
  • దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడానికే నిర్ణయమని వెల్లడి
  • శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసిన డీజీఎఫ్ టీ
దేశీంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్ లు, పీసీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. దిగుమతులపై ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని గురువారం ప్రకటించిన ప్రభుత్వం.. శుక్రవారం ఈ నిర్ణయానికి సవరణలు చేసింది. దిగుమతులపై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్ టీ) ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో అక్టోబర్ 31 వరకు ఎప్పటిలానే లైసెన్స్ లేకున్నా ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లను దిగుమతి చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం లైసెన్స్ ఉన్న వ్యాపారులు, సంస్థలు అదీ కూడా పలు ఆంక్షలకు లోబడి దిగుమతి చేసుకునే వీలుంటుంది. అదేవిధంగా ఈ దిగుమతులపై సుంకం చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాల సమాచారం.

ఈ నిర్ణయానికి కారణం..
విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలలో భద్రతాపరమైన కొన్ని లొసుగులను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ లొసుగులతో వినియోగదారుల సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఇబ్బందిని తప్పించేందుకే దిగుమతులపై ఆంక్షలు విధించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ల్యాప్ టాప్ ల దిగుమతులపై పూర్తిగా బ్యాన్ విధించలేదని, లైసెన్స్ పొందిన సంస్థలు దిగుమతి చేసుకోవడానికి ఇబ్బందిలేదని చెప్పారు. ఈ లైసెన్స్ పొందండం కూడా సులభమేనని, కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో లైసెన్స్ మంజూరు చేస్తున్నామని వివరించారు.


More Telugu News