భారీ వర్షాలు అన్నారు కదా అని సెలవులు ప్రకటిస్తే వర్షమే లేదు.. వాతావరణశాఖ పనితీరుపై అక్బరుద్దీన్ విమర్శలు

  • అసెంబ్లీలో వరదలపై లఘు చర్చలో అక్బరుద్దీన్ విమర్శలు
  • వాతావరణశాఖ పనితీరు మెరుగుపడాలని సూచన
  • రూ. 4500 కోట్ల నష్టమని రూ. 500 కోట్ల సాయంపై మాత్రమే ప్రకటన చేశారన్న రఘునందన్‌రావు
  • ముంపు ప్రాంత ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్న సీతక్క
వాతావరణశాఖ పనితీరు ఏమాత్రం బాగోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. వరదలపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో  మాట్లాడిన ఆయన.. రెండు  రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే, ఆ తర్వాత మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెబుతోందని పేర్కొన్నారు. వాతావరణశాఖ చెప్పింది కదా అని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తే చుక్క వర్షం కూడా పడడం లేదని అన్నారు. ఇలా అయితే లాభం లేదని, వాతావరణశాఖ పనితీరు మెరుగుపడాలని అన్నారు. కచ్చితమైన సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదే చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వానలు, వరదల కారణంగా రూ. 4,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పారని, కానీ రూ. 500 కోట్ల వరద సాయంపై మాత్రమే ప్రకటన చేశారని విమర్శించారు. వర్షాలు, వరదలతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..  వరదల వల్ల ములుగు జిల్లాలో 15 మంది మృతి చెందారని తెలిపారు. వరద బాధితులు కొందరు సర్వస్వం కోల్పోయి ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముంపు ప్రాంత ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


More Telugu News