నా సొంత జిల్లాలో నన్ను అడ్డుకుందామని చూస్తారా?: పూతలపట్టులో చంద్రబాబు ఉగ్రరూపం

  • పూతలపట్టులో చంద్రబాబు బహిరంగ సభ
  • వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని వెల్లడి
  • ఆ పార్టీకి ఆఖరి చాన్స్ అయిపోయిందని స్పష్టీకరణ
  • పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని హెచ్చరిక
  • జగన్... ఇక నీ ఆటలు సాగనివ్వబోమని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని, ఆ పార్టీకి ఆఖరి చాన్స్ అయిపోయిందని అన్నారు. 

వైసీపీ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని, అందుకే తన పర్యటనలకు అడ్డుతగులుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  

నా సొంత జిల్లాలోనే నన్ను అడ్డుకుందామని చూస్తారా... పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో నేను చూస్తా... పెద్దిరెడ్డి ఖబడ్దార్ అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. నాపైనే దాడికి యత్నించి, చిత్తూరు జిల్లా బంద్ కు పిలుపునిస్తారా? అంటూ మండిపడ్డారు. 

జిల్లా ఎస్పీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా? లేక పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తున్నాడా? అని నిలదీశారు. నా పర్యటనను ఆటంకం కలిగించే వారిని అడ్డుకునే బాధ్యత ఎస్పీకి లేదా? ఎస్పీ నాపై దాడి చేయించాలని అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఎన్ఎస్ జీ భద్రత లేకుంటే నాపై కూడా గొడ్డలి వేటు వేసేవారేమో అని అంత తీవ్ర పరిస్థితుల్లోనూ చంద్రబాబు చమత్కరించారు.

"నన్ను కట్టడి చేయడం ఈ సైకోల వల్ల కూడా కాదు. 60 లక్షల ఓట్లు మనం తొలగించామంట. జగన్నాటకం ఆడుతున్న ఈ జగన్ గొప్ప నటుడు. కమల్ హాసన్ కూడా ఆయన ముందు పనికిరాడు. చేసే తప్పులన్నీ ఇతరులపైకి నెట్టి, దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగో ఇంతవరకు చేశావ్... ఇకమీదట నీ ఆటలు సాగనివ్వం. ప్రజలు తమ ఓట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటుండండి" అని స్పష్టం చేశారు.


More Telugu News