పుంగనూరులో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలపై పవన్ కల్యాణ్ స్పందన

  • పుంగనూరు వెళ్లిన చంద్రబాబు
  • టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
  • పోలీసుల లాఠీచార్జి
  • గాయపడిన టీడీపీ కార్యకర్తలు
  • అధికార పార్టీ హింసా ప్రవృత్తికి నేటి ఘటనలు నిదర్శనమన్న పవన్
రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదనే నియంతృత్వం పెచ్చరిల్లుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. 

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. 

ప్రజల తరఫున పోరాడడం ప్రతిపక్షాల బాధ్యత అని, ఇవాళ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలు వాంఛనీయం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ల దాడులకు పాల్పడడం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృత్తిని తెలియజేస్తోందని అభిప్రాయపడ్డారు. వారి నియంతృత్వ పోకడలు అంతకంతకు అధికమవుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పుంగనూరులో జరిగిన సంఘటనలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.


More Telugu News