ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- తెలంగాణలోని వివిధ అంశాలపై చర్చించినట్లు వెల్లడించిన కోమటిరెడ్డి
- జాతీయ రహదారి 65పై గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేని ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ
- రెండు యూనివర్సిటీలపై ఫిర్యాదు చేశానన్న కోమటిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కలిశారు. తెలంగాణలోని వివిధ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుండి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరానని, ఇందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారన్నారు. వీటికి యూనివర్సిటీ హోదా లేకపోయినప్పటికీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, తాను ప్రధానిని కలిసిన విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోను పోస్ట్ చేశారు.