రైతులు సొంత డబ్బుతో కాలువలు బాగు చేసుకుంటున్నారు: నాదెండ్ల మనోహర్

  • వైసీపీ ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్న నాదెండ్ల  
  • రైతు భరోసా పేరుతో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ
  • తెనాలికి జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలూ ఉన్నాయన్న నాదెండ్ల
కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో పంట కాలువలకు నాలుగేళ్లుగా కనీస మరమ్మతులు లేవని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ డబ్బుతో కాలువలు బాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రధాన కాలువలను విస్మరించారన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులను, వ్యవసాయాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు.

రైతులకు, పేదలకు, మహిళలకు న్యాయం జరుగుతుందనే ఉద్ధేశ్యంతోనే 2019లో ప్రజలు వైసీపీకి అద్భుత మెజార్టీతో అధికారం కట్టబెట్టారన్నారు. కానీ ఎవరికీ న్యాయం జరగడం లేదన్నారు. రైతు భరోసా పేరుతో రైతులను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ వ్యవసాయానికి తీరని నష్టం చేసే విధంగా జగన్ పాలన ఉందన్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియాపై ప్రభుత్వం దృష్టి సారించాలని, రైతులకు పరికరాలు అందించాలన్నారు. ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ అని, వారికి సహకారంగా ఉండాలన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో... తెనాలికి ఉన్న వైభవం, గుర్తింపు ఉండే విధంగా జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని భావించామని, కానీ దానిని తేలేకపోయారన్నారు. జిల్లా కేంద్రంగా తెనాలికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అలాగే ఇక్కడ ఉన్న తాలుకా జూనియర్ కాలేజీ వంటి విద్యా సంస్థను కూడా కాపాడుకోలేకపోయామన్నారు. ఇలాంటివి కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది చాలా బాధ కలిగించే విషయమన్నారు. రేపు ప్రభుత్వంలో తాము ఉంటే తాలుకా జూనియర్ కాలేజీకి పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు.


More Telugu News