రెండేళ్ల శిక్ష కేసులో సుప్రీంలో ఊరట.. ఇప్పుడు లోక్‌సభ సమావేశాలకు రాహుల్ హాజరుకావచ్చా?
- రాహుల్‌పై విధించిన జైలు శిక్ష అమలుపై సుప్రీం స్టే
- తిరిగి ఎంపీగా రాహుల్ కొనసాగేందుకు అవకాశం
- అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ ఇస్తేనే!
‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష అమలుపై ధర్మాసనం స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తారా? ప్రస్తుత లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయనకు అవకాశం ఉందా? వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. లోక్‌సభ సచివాలయం ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసింది. చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు జైలు శిక్ష పడిన వ్యక్తి రాజ్యాంగ పదవికి అనర్హులవుతారు. శిక్షాకాలంతోపాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు.
ఇప్పుడు శిక్ష అమలుపై సుప్రీం స్టే ఇవ్వడంతో.. రాహుల్ గాంధీ తిరిగి ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. అయితే సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాహుల్‌పై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు మళ్లీ నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి రాహుల్ నిర్దోషి అని కోర్టు ప్రకటిస్తే.. లేదా రాహుల్ శిక్షా కాలాన్ని 2 ఏళ్ల కంటే తక్కువ చేస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు వీలుంటుంది. ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం.