మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా..? ఇలా చేస్తే చాలు!

  • ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు
  • తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి
  • హెవీగా తినకుండా, పీచుకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఉద్యోగ, వృత్తి, వ్యాపార జీవితం మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత నుంచి కడుపులో ఆకలి అనిపిస్తుంటుంది. దీంతో లంచ్ చేసే సమయం కోసం మనసు ఎదురు చూస్తుంటుంది. తీరా లంచ్ సమయం రాగానే కడుపునిండా తినేస్తాం. ఇక ఆ తర్వాత నుంచి నిద్ర పాట్లు మొదలవుతుంటాయి. కళ్లు మూతలు పడుతుంటాయి. సాధారణంగా ఎక్కువ మందికి ఇలాంటి అనుభవమే ఎదురవుతుంటుంది. అలా కొంత సమయం పాటు నిద్ర వేధిస్తుంటుంది. 

తిన్న తర్వాత తిరిగి ఉత్సాహంగా పనిచేసుకునేట్టు ఉండాలి కానీ, ఈ నిద్ర గొడవ ఏంటిరా బాబూ? అని బాధపడే వారుంటారు. తిన్న తర్వాత నిద్ర వస్తుంటే దీన్ని పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్ అంటారు. అంటే ఫుడ్ కోమాగా దీన్ని చెబుతారు. ఎందుకని ఇది వస్తుంటుంది? దీనికి కారణాన్ని పరిశీలిస్తే శరీరం తిన్న తర్వాత మరింత సెరటోనిన్ ను ఉత్పత్తి చేస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. సెరటోనిన్ అనేది న్యూరోట్రాన్స్ మీటర్. నిద్ర, మూడ్ ను ఇది ప్రభావితం చేస్తుంటుంది. తిన్న తర్వాత ఇలా నిద్ర రావడం అన్నది అనారోగ్యం ఏమీ కాదు. కాకపోతే తిన్న తర్వాత పని చేయాల్సి ఉంటే పెద్ద అడ్డంకిగా మారుతుంది. దీన్ని అధిగమించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

పరిమాణం
లంచ్ లో భాగంగా తీసుకునే ఆహార పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా హెవీగా (అధికంగా) తినకూడదు. సరిపడానే తినాలి. కొంత వెలితిగా తింటే మరీ మంచిది. పనిచేస్తూ అస్సలే తినొద్దు. దీనివల్ల ఎంత తింటున్నామన్నది పట్టింపు ఉండదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను మిస్ చేసుకోవద్దు. ఉదయం ఏమీ తినకపోయినా, మధ్యాహ్నం ఎక్కువగా తినాల్సి వస్తుంది. దాంతో నిద్ర ముంచెత్తుతుంది.

మెనూ
ఆహారంలో భాగంగా ఏమి తింటున్నామనేది కూడా ముఖ్యమే. ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే ఫ్యాట్ ఎక్కువగా ఉంటే దాన్ని జీర్ణం చేసుకోవడానికి శ్రమ పడాల్సి వస్తుంది. కనుక లంచ్ లో భాగంగా అధిక కొవ్వుతో ఉండే వాటికి దూరంగా ఉండాలి. ఇక అధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారంతోనూ ఇదే సమస్య ఎదురవుతుంది. కనుక పీచుతో కూడిన సమతులాహారం, పండ్లు, కూరగాయలతో కలిపి తీసుకోవాలి.

ముడి ధాన్యాలు మంచివి. పీచుతో ఉన్న వాటి వల్ల తిన్న వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ ఒకేసారి విడుదల కాదు. లంచ్ లో భాగంగా షుగర్ తో కూడిన డ్రింక్స్ ను తాగొద్దు. వాటివల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. లంచ్ కు ముందు ఆల్కహాల్ ను సైతం తీసుకోవద్దన్నది నిపుణుల సూచన. లంచ్ ను ఎప్పుడూ బయట తినడం కాకుండా, ఇంటి ఆహారాన్నే తీసుకోవాలి. 

రాత్రి నిద్ర
ఇక రాత్రి మంచి నిద్రపోయేలా జీవన చర్యల్లో మార్పు చేసుకుంటే, అప్పుడు కూడా మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వచ్చే సమస్య కనిపించదు. రాత్రి నిద్ర మంచిగా పోవడం వల్ల హార్మోన్ల విడుదల చక్కగా ఉంటుంది. జీవక్రియలు చురుగ్గా మారతాయి. దాంతో మధ్యాహ్నం నిద్ర సమస్య ఉండదు. నిద్ర లేమి వల్ల శరీరంలో గ్రెలిన్ పెరిగిపోతుంది. ఈ హార్మోన్ మెదడుకి బాగా ఆకలితో ఉన్నట్టు సంకేతాలు పంపిస్తుంది. 

మధుమేహం ఉన్నా అంతే..
ఇక తిన్న వెంటనే నిద్ర కుమ్మేస్తుంటే, ఆహారంలో మార్పులు చేసుకున్న తర్వాత కూడా ఇందులో మార్పు లేకపోతే.. అప్పుడు మధుమేహం ఉందేమో ఓసారి పరీక్షలు చేయించుకోవాలి.


More Telugu News