తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై భట్టి విక్రమార్క విమర్శలు

  • సభలో అప్పటికప్పుడు ఎజెండా పెడితే ఎలా అని మండిపాటు 
  • ప్రశ్నోత్తరాలలో ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడంలేదని ఆరోపణ
  • ప్రశ్నలు, జవాబులు అధికార పార్టీ నేతలే చెబుతున్నారని అసహనం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో కూడా ప్రతిపక్షాలకు సమాచారం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వం ఇష్టారీతిన సమావేశాలు జరుపుతోందని, సభలో ఎజెండా గురించి తమకు ముందుగా చెప్పడంలేదని విమర్శించారు. సమావేశాల నిర్వహణ తీరుపై భట్టి విక్రమార్క శుక్రవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు టేబుల్ పై ఎజెండా పెడితే చర్చించేదెలా అంటూ అధికార పార్టీపై ధ్వజమెత్తారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేతలకు సమయం ఇవ్వడంలేదని స్పీకర్ పై సీఎల్పీ లీడర్ ఆరోపించారు. ప్రశ్నలు, వాటికి జవాబులు కూడా అధికార పార్టీ నేతలే చెబుతున్నారని చెప్పారు. ప్రశ్నకు సభ్యుడి పేరు ఉంటేనే మైక్ ఇస్తామని అనడం శాసన సభ్యుల హక్కులను కాలరాయడమేనని భట్టి విక్రమార్క విమర్శించారు.


More Telugu News