మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడడంతో ఆరుగురు భారతీయుల మృతి

  • నాయారిట్ రాష్ట్ర రాజధానికి సమీపంలోని బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో ఘటన
  • ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
  • ఇప్పటివరకూ మొత్తం 17 మంది మరణించినట్టు వెల్లడి
  • లోయ లోతు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారిన వైనం
మెక్సికోలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 17 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు. నాయారిట్ రాష్ట్రంలో రాజధాని టెపిక్‌కు కొద్ది దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు అక్కడి అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. 

ఘటన సమాచారం అందగానే పోలీసులు, అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు 50 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని అత్యవసర సిబ్బంది పేర్కొన్నారు. ఘటనలో మరణించిన భారతీయులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఘటనపై బస్సు సర్వీసు నిర్వహిస్తున్న సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు. మెక్సికో మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు.


More Telugu News