ఒంటిమిట్టలో దారుణం.. స్నానం చేస్తున్న మహిళలను మొబైల్ ఫోన్ తో చిత్రీకరించిన యువకుడు

  • బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ఫోన్‌లో రికార్డింగ్
  • బాధితులు యువకుడిని గమనించి పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అతడు పరార్
  • పనిచేయని సీసీటీవీ కెమెరాలు, నిందితుడి ఆచూకీ పట్టుకోవడం కష్టంగా మారిన వైనం
  • మహిళల కోసం మరిన్ని కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపడతామన్న ఆలయ డిప్యూటీ ఈవో
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట ఆలయం సమీపంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో స్నానం చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గమనించిన మహిళలు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. 

గురువారం రాములవారి దర్శనం కోసం రెండు కుటుంబాలు అక్కడకు వచ్చాయి. ఉదయం 6.30కి ఇద్దరు మహిళలు అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాత్రూంలలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు బాత్రూం వెంటిలేటర్ నుంచి వారిని చిత్రీకరించడం ప్రారంభించాడు. మహిళలు ఇది గమనించి కేకలు వేయడంతో అతడు పరారయ్యాడు. 

బాధితుల ఫిర్యాదు మేరకు భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి స్థానికంగా నిందితుడి కోసం గాలించినా ఉపయోగం లేకపోయింది. అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా సరిగా పనిచేయకపోవడంతో నిందితుడి ఆచూకీ కనుగొనడం సిబ్బందికి కష్టంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ ఈఓ నటేష్‌బాబు మహిళల భద్రత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని హామీ ఇచ్చారు.


More Telugu News