పది పాసయ్యారా.... అయితే పరీక్ష లేకుండానే పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

  • టెన్త్ మార్కులే ప్రాతిపదిక
  • కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వస్తే చాలు
  • బ్రాంచి పోస్టు మాస్టర్, అసిస్టెంట్ పోస్టు మాస్టర్, జీడీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • దేశవ్యాప్తంగా 30 వేల ఉద్యోగ నియామకాలకు పోస్టల్ శాఖ నిర్ణయం
ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ మరోసారి భారీగా కొలువుల పండుగకు తెరలేపింది. తాజాగా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి పాసైతే చాలు... పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే సదుపాయాన్ని భారత పోస్టల్ శాఖ కల్పిస్తోంది. 

అయితే, టెన్త్ పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఈ ఉద్యోగ నియామకాలు ఉంటాయి. అంతేకాదు, అభ్యర్థులకు సైకిల్ తొక్కడం రావాలి. ఈ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు (ఆగస్టు 3) నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 23. 

గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు మాత్రమే కాదు, బ్రాంచి పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచి పోస్టు మాస్టర్ ఉద్యోగాలకు కూడా రాత పరీక్ష లేదు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. 

కాగా, ఈ పోస్టల్ ఉద్యోగాల్లో ఏపీకి 1,058... తెలంగాణకు 961 కేటాయించారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రోజుకు 4 గంటలే విధులు ఉంటాయి. వీరికి పోస్టల్ డిపార్ట్ మెంటే కంప్యూటర్/ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ అందిస్తుంది.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు....

  • మొత్తం ఉద్యోగాల సంఖ్య 30,041
  • ఆగస్టు 3 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
  • ఆగస్టు 23 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • ఆగస్టు 24 నుంచి 26 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం
  • పదో తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాలు
  • గణితం, ఆంగ్లం, స్థానిక భాషతో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి
  • కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం తప్పనిసరి
  • వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల మినహాయింపు
  • ఓబీసీలకు 3 ఏళ్లు మినహాయింపు
  • దివ్యాంగులకు 10 ఏళ్ల మినహాయింపు
  • డాక్ సేవక్ ఉద్యోగులకు వేతన శ్రేణి రూ.10,000-రూ.24,470
  • బ్రాంచి పోస్టు మాస్టర్ వేతన శ్రేణి రూ.12,000-రూ.29,380
  • అసిస్టెంట్ బ్రాంచి పోస్టు మాస్టర్ వేతన శ్రేణి- రూ.10,000-రూ.24,470
  • పనిచేసే కార్యాలయానికి సమీపంలో నివాసం ఉండాలి 
  • ఇతరత్రా జీవనోపాధి పొందే వనరులు కలిగి ఉండాలి
  • అభ్యర్థులు తమ దరఖాస్తులను https://indiapostgdsonline.gov.in/ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది
  • పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందిస్తారు
  • మెరిట్ లిస్టులను పోస్టల్ శాఖ వెబ్ సైట్లోనూ, జీడీఎస్ ఆన్ లైన్ పోర్టల్ లోనూ విడుదల చేస్తారు



More Telugu News