ఉగ్రవాదరహిత వాతావరణం ఉండాలి!: పాక్ ప్రధాని చర్చల మాటపై భారత్ స్పష్టీకరణ

  • ఢిల్లీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 
  • పాకిస్థాన్ సహా పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు వెల్లడించిన భారత్
  • భారత స్థిర, స్పష్టమైన వైఖరి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య
దౌత్య సంబంధాలపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ సహా పొరుగున ఉన్న అన్ని దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు తెలిపింది. భారత్‌తో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఢిల్లీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. పొరుగు దేశాలతో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని, కానీ ఉగ్రవాదరహిత వాతావరణం ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.

ఈ సంబంధాలు ఉగ్రవాదం, హింసకు తావులేని విధంగా ఉండాలన్నారు. ఈ సమస్యపై పాకిస్థాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికలను చూశామని, పాకిస్థాన్‌ సహా మన పొరుగు దేశాలన్నింటితో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని, భారతదేశ స్పష్టమైన, స్థిరమైన వైఖరి అందరికీ తెలిసిందేనని అరిందమ్ పేర్కొన్నారు. హింస, శత్రుత్వం లేని వాతావరణం అవశ్యమన్నారు.


More Telugu News