కియా పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకుని జగన్ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరిన చంద్రబాబు

  • రాయలసీమలో చంద్రబాబు పర్యటన
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను సందర్శించిన టీడీపీ అధినేత
  • అనంతపురం జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు తెచ్చిందో చెప్పాలని సవాల్
  • కరవు నేలపై కియాతో ప్రభంజనం సృష్టించామని వ్యాఖ్య  
టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమను సందర్శించారు. కియా యూనిట్ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. 

అనంతపురం జిల్లాకు వైసీపీ సర్కారు ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చిందో చెప్పాలి? పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలి? అని నిలదీశారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో గొల్లపల్లి నుంచి కియా కార్ల పరిశ్రమకు నీటి సరఫరా చేశామని చంద్రబాబు వెల్లడించారు. రికార్డు సమయంలో రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేసినట్టు వివరించారు. పెనుకొండ ప్లాంటులో తయారైన కియా కార్ల అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని తెలిపారు. 

"అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఒక ప్రభంజనం. కరవు నేలపై ఎవరైనా కియా పరిశ్రమను ఊహించారా? అనంతపురం జిల్లాపై ప్రేమతోనే ఈ ప్రాజెక్టును తీసుకువచ్చాను. కేవలం ఆరు నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీరు అందించాం. రాళ్ల సీమ అనిపించుకున్న రాయలసీమలో కియా సిరుల పంట టీడీపీ సాధించిన విజయం. కియా ప్లాంటులో 10 లక్షల కార్ల ఉత్పత్తి జరిగింది. కియా పరిశ్రమ స్థాపన ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాం" అని వివరించారు.


More Telugu News