జనసేన సినిమాకు ఇబ్బందులు వస్తే నన్ను కలవమనండి: అంబటి రాంబాబు

  • జనసేన రాజకీయాలు మానుకొని సినిమాలు చేస్తామంటే ఇబ్బంది లేదన్న మంత్రి
  • జనసేన ఏ సినిమా తీసినా ఇబ్బంది లేదన్న అంబటి రాంబాబు
  • షెకావత్, విజయసాయి రెడ్డిలను కలిసినట్లు చెప్పిన అంబటి
జనసేన పార్టీ వారు రాజకీయాలు మానుకొని, సినిమాలు చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తాను ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి షెకావత్, తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలను కలిసినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఓసారి సందర్శించాలని తాను కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ భేటీలో కొన్ని విషయాలు చెప్పాల్సినవి, మరికొన్ని చెప్పకూడనివి ఉంటాయని వ్యాఖ్యానించారు. డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలా? ఏం చేయాలి? అనేది నిపుణులు పరిశీలిస్తారన్నారు.

జనసేన మీపై ఓ సినిమా తీస్తున్నట్లుగా చెబుతోందని ఓ మీడియా ప్రతినిధి చెప్పగా... వారు సంబరాల రాంబాబు.. సందులో సంబరాల రాంబాబు అలియాస్ రాంబాబు.. ఏ సినిమా అయినా తీసుకోనీయండన్నారు. ఈ సినిమాకు ఏమైనా ఇబ్బందులు వస్తే తనను సంప్రదించమని చెప్పండి అని సూచించారు. జనసేన రాజకీయాలు మాని సినిమాలు తీస్తామంటే ఇబ్బంది లేదన్నారు. తాను మాత్రం తన స్నేహితులతో కలిసి సినిమా తీద్దామనుకుంటున్నామన్నారు.


More Telugu News