నాకు పెళ్లయింది.. కోపం రాదు.. నన్ను నమ్మండి: రాజ్యసభలో నవ్వులు పూయించిన చైర్మన్
- రాజ్యసభ చైర్మన్‌ను కలిసినప్పుడు ఆగ్రహంతో ఉన్నారన్న ఖర్గే
- తాను ఎప్పుడూ కోపంగా లేనన్న జగదీప్ ధన్‌కర్
- న్యాయవాదులుగా తమకు చూపించే హక్కు మాకు లేదని వ్యాఖ్య
రాజ్యసభలో గురువారం నవ్వులు పూశాయి. మణిపూర్ హింసపై చర్చ విషయంలో ఉప్పు నిప్పులా ఉన్న అధికార ప్రతిపక్షాలు కాసేపు చల్లబడ్డాయి. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ వ్యాఖ్యలతో సభ్యులంతా ఘొల్లుమని నవ్వారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రూల్ 267కు ప్రాధాన్యమిస్తూ సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని, మణిపూర్ సమస్యపై చర్చ చేపట్టాలని కోరారు. బుధవారం రాజ్యసభ చైర్మన్‌ను కలిసినప్పుడు ఆయన ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
దీంతో వెంటనే స్పందించిన చైర్మన్ జగదీప్ ధన్‌కర్.. ‘‘నాకు పెళ్లి అయి 45 ఏళ్లు దాటింది. నన్ను నమ్మండి సార్.. నేను ఎప్పుడూ కోపంగా లేను” అని చెప్పగానే అందరూ గట్టిగా నవ్వేశారు. ‘‘న్యాయవాదులుగా కనీసం అధికారులపై కూడా కోపం చూపించే హక్కు మాకు లేదు. విశిష్ట న్యాయవాది చిదంబరం గారికి ఈ విషయం బాగా తెలుసు.. మీరు అథారిటీ సర్. నేను ఎప్పుడూ కోపంగా లేను. దయచేసి సవరించండి” అని చైర్మన్ సరదాగా అన్నారు.
దీంతో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘బహుశా మీరు కోపాన్ని ప్రదర్శించరు.. కానీ మీకు కోపం వస్తుంటుంది” అని అనడంతో సభ్యులంతా మరోసారి నవ్వుకున్నారు. ఈ సమయంలో తన భార్య గురించి ప్రస్తావించిన జగదీప్ ధన్‌కర్.. ‘‘ఆమె ఈ హౌస్‌లో సభ్యురాలు కాదు. సభలో సభ్యురాలు కాని వ్యక్తి గురించి మనం చర్చించలేం. లేకపోతే మనం చర్చించవచ్చు” అని చమత్కరించారు.