ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదు, వాటినే ఎన్నికలకు ఖర్చు చేస్తున్నానంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి
  • మేడ్చల్ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులను తానే నిర్ణయిస్తానన్న మల్లారెడ్డి
  • కాంగ్రెస్ అధిష్ఠానంలో తనకు మిత్రులున్నారని వ్యాఖ్య
టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదని, ఆ డబ్బులే ఇప్పుడు తాను ఎన్నికలకు ఖర్చు చేస్తున్నానని చెప్పారు. తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో టికెట్ చర్చపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే డిసైడ్ చేస్తానని కామెంట్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే నిర్ణయిస్తానని చెప్పడం గమనార్హం. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్‌కు టికెట్ ఇప్పించింది తానేనని చెప్పారు. మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూప్ గొడవలు తామే సృష్టిస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంలో తనకు స్నేహితులు ఉన్నారని మల్లారెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తరువాత గ్రాఫ్ పెరిగిందని మల్లారెడ్డి తెలిపారు.


More Telugu News