ప్రతి ఒక్కరినీ కాపాడడం ప్రభుత్వానికి సాధ్యం కాదు: హర్యానా సీఎం

  • రాష్ట్రంలో హింసాత్మక ఆందోళనలపై సీఎం వ్యాఖ్యలు
  • శాంతియుతంగా ఉండాలంటూ ప్రజలకు పిలుపు
  • ప్రజలు లక్షల్లో ఉండగా పోలీసుల సంఖ్య 50 వేల లోపే ఉందని వివరణ
రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ కాపాడడం పోలీసుల వల్ల కాదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో, ప్రపంచంలో.. ఎక్కడైనా సరే ప్రతీ ఒక్కరినీ రక్షించడం, భద్రత కల్పించడం పోలీసులకు, సైన్యానికి అసాధ్యమైన పనంటూ వివరించారు. సత్సంబంధాలతోనే శాంతి సాధ్యమని, ఎదుటివారితో ఘర్షణ పడితే అందరినీ కాపాడడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

హర్యానాలో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలపై ముఖ్యమంత్రి ఖట్టర్ స్పందిస్తూ.. రాష్ట్రంలో జనాభా లక్షల్లో ఉండగా, పోలీసుల సంఖ్య మాత్రం 50 వేల లోపే ఉందని గుర్తుచేశారు. ప్రజలు శాంతియుతంగా ఉన్నపుడే భద్రత సాధ్యమని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను చల్లార్చేందుకు శాంతి కమిటీలను రంగంలోకి దించినట్లు తెలిపారు. శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. అల్లరిమూకలను కట్టడి చేయడానికి మరిన్ని బలగాలను పంపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.


More Telugu News