చెన్నైలో ఒక్కొక్కటిగా మూతబడుతున్న అమ్మ క్యాంటీన్లు

  • 2013లో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించిన జయలలిత
  • ఒక్క చెన్నైలోనే 407 క్యాంటీన్లు
  • ఇప్పటికే 14 క్యాంటీన్ల మూత
తమిళనాడు రాజధాని చెన్నైలోని అమ్మ క్యాంటీన్లు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ఇప్పటి వరకు 14 క్యాంటీన్లను ప్రభుత్వం మూసివేసింది. నామమాత్రపు డబ్బుతో పేదల ఆకలి తీర్చేందుకు 2013లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వీటిని ప్రారంభించారు. వీటికి మంచి స్పందన రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన పన్నీర్‌సెల్వం, పళనిస్వామి కూడా వీటి నిర్వహణపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే, డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పేరుతో వాటిని కొనసాగించి ప్రశంసలు అందుకున్నారు.

అయితే, ఇప్పుడు నష్టాలను సాకుగా చూపిస్తూ ఒక్కో క్యాంటీన్‌ను మూసేస్తున్నారు. వార్డుకు రెండు చొప్పున ఒక్క చెన్నైలోనే 407 క్యాంటీన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 14 క్యాంటీన్లను అధికారులు మూసివేయగా, టీనగర్‌లోని త్యాగరాయరోడ్డులో ఉన్న క్యాంటీన్‌ను కూడా మూసివేయాలని చెన్నై కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. పేదల ఆకలి తీర్చే క్యాంటీన్లు మూతబడుతుండడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News