'మోదీ' ఇంటి పేరు పరువునష్టం కేసు... క్షమాపణ చెప్పేది లేదన్న రాహుల్ గాంధీ

  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
  • ఎలాంటి నేరానికి పాల్పడలేదని పునరుద్ఘాటన
  • క్రిమినల్ కేసు మోపి బలవంతపు క్షమాపణ కోరడం న్యాయవ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమేనని వెల్లడి
'మోదీ' అనే ఇంటి పేరు కేసులో క్షమాపణలు చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. తాను నిర్దోషినని సుప్రీం కోర్టు ఎదుట బుధవారం పునరుద్ఘాటించారు. అంతేకాదు, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని, ప్రస్తుతం కొనసాగుతున్న లోక్ సభ సమావేశాలలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కేసులో ఆయన సుప్రీం కోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు.

తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తానేమీ శిక్షార్హమైన నేరం చేయలేదన్నారు. క్షమాపణ చెప్పే తప్పు చేస్తే, ఇప్పటికే చెప్పేవాడినని పేర్కొన్నారు. కానీ ఏ తప్పు చేయనందున క్షమాపణ చెబితే అదే పెద్ద శిక్ష అవుతుందన్నారు. 

తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో పరువు నష్టం దావా వేసిన పూర్ణేష్ మోదీ తనను అహంకారి అని పేర్కొన్నాడని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఏ తప్పు చేయలేకపోయినా క్రిమినల్ నేరాలు మోపి, బలవంతంగా క్షమాపణ చెప్పాలనడం న్యాయవ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని  రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


More Telugu News