ఏపీలో వేద విద్యాలయం ఏర్పాటుపై వైసీపీ ఎంపీ ప్రశ్న... జవాబిచ్చిన కేంద్రం

  • రాష్ట్రీయ వేద విద్యాలయాల ఏర్పాటుపై ప్రశ్న  
  • అయోధ్య రామిరెడ్డి ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం
  • కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ప్రధాన్
ఏపీలో వేద విద్యాలయం ఏర్పాటుపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. రాష్ట్రీయ ఆదర్శ వేద విద్యాలయాలను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పడానికి కేంద్రం సానుకూలంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 4 విద్యాలయాలు స్థాపిస్తున్నట్టు తెలిపారు. 

ఏపీలో వేద విద్యాలయం ఏర్పాటు అంశంపై పరిస్థితులను బట్టి, తగిన విధంగా సానుకూలంగా పరిశీలిస్తామని ధరేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాంతోపాటే, కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా కేంద్రం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.

ఇక, వేదాలకు సంబంధించిన పుస్తకాలను పార్లమెంటులో సభ్యులకు పంపిణీ చేయాలన్న రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ చేసిన సూచనకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమ్మతి తెలిపారు. వేదాల పట్ల అందరికీ అవగాహన ఉండాలని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు వేదాల గురించి తెలిసి ఉండాలని రాజ్యసభ చైర్మన్ పిలుపునిచ్చారు.


More Telugu News