నిన్ననే ఢిల్లీకి చేరుకున్న జూపల్లి.. బిజీగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్
- మణిపూర్ అంశంపై అట్టుడుకుతున్న పార్లమెంట్ సమావేశాలు
- రాష్ట్రపతిని కలిసే బిజీలో విపక్ష నేతలు
- అధిష్ఠానం నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్న జూపల్లి
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ లో చేరే ఘడియలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి, ఆ పార్టీలో యాక్టివ్ అయ్యారు. మరోవైపు నిన్ననే జూపల్లి ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు ఆయన హస్తినకు వెళ్లారు. అయితే, మణిపూర్ అంశంపై పార్లమెంటు సమావేశాలు అట్టుడుకుతున్నాయి. మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈరోజు కలిసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సహా, ఇతర అగ్రనేతలు చాలా బిజీగా ఉన్నారు. దీంతో, కాంగ్రెస్ లో జూపల్లి చేరికపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, అధిష్ఠానం పిలుపు కోసం జూపల్లి వేచి చూస్తున్నారు.