అణ్వాయుధాలు మమ్మల్ని రక్షించుకోవడానికే.. భారత్ తో చర్చలకు సిద్ధం: పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

  • అణు యుద్ధం జరిగితే ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ ఉండరన్న పాక్ ప్రధాని
  • అణు యుద్ధం జరిగితే విధ్వంసం ఎంత ఘోరంగా ఉంటుందో తమకు తెలుసని వ్యాఖ్య
  • ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదన్న షాబాజ్ షరీఫ్
అన్ని సమస్యలపై భారత్ తో చర్చించేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని... యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. ఇరు దేశాలు పేదరికాన్ని, నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎవరితోనైనా చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని... చర్చలకు భారత్ కూడా సిద్ధంగా ఉంటే ఆ దేశంతో కూడా చర్చలు జరుపుతామని అన్నారు. 

పాకిస్థాన్ ఒక అణ్వాయుధ దేశమని... తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసమేనని, యుద్ధం కోసం కాదని పాక్ ప్రధాని చెప్పారు. ఒకవేళ అణు యుద్ధమే జరిగితే... ఏం జరిగిందో చెప్పడానికి ఆ తర్వాత ఎవరూ మిగిలి ఉండరని అన్నారు. అందువల్ల ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. అణు యుద్ధం జరిగితే దాని విధ్వంసం ఎంత ఘోరంగా ఉంటుందో పాకిస్థాన్ కు తెలుసని... ఇదే విషయాన్ని ఇండియా కూడా గ్రహించాలని చెప్పారు. త్వరలోనే పాకిస్థాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 



More Telugu News