హరీశ్ రావుకు కంగ్రాట్స్ తెలిపిన కేటీఆర్
- ఈ ఉదయం 466 అత్యవసర వాహనాలను ప్రారంభించిన కేసీఆర్
- ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సర్వీసెస్ లో గొప్ప పురోగతి అన్న కేటీఆర్
- సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి
ఈ ఉదయం 466 అత్యవసర వాహనాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 204 అంబులెన్స్ లు, 228 అమ్మఒడి వాహనాలు ఉన్నాయి. ఆరోగ్య తెలంగాణ కార్యక్రమంలో భాగంగా వీటిని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు, ఆరోగ్యమంత్రి, తన బావ హరీశ్ రావుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సర్వీసెస్ లో ఇది అతి గొప్ప పురోగతి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆరోగ్య మంత్రి హరీశ్ రావుకు, ఆయన టీమ్ కు కంగ్రాట్ అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
మరోవైపు హరీశ్ రావు మాట్లాడుతూ... వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 466 ఎమర్జెన్సీ వాహనాలను సమకూర్చుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని... ప్రస్తుతం ప్రతి 75 వేల మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉందని తెలిపారు. అమ్మఒడి వాహనాలకు నిధులు కావాలని కోరగానే సీఎం కేసీఆర్ విడుదల చేశారని చెప్పారు.