వనమా.. జలగం.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేదెవరు?

  • వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు
  • తీర్పు కాపీతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన జలగం
  • ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
  • ఇద్దరిలో ఎవరు హాజరవుతారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 3 (గురువారం) నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఓ విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై రాష్ట్ర హైకోర్టు వేటు వేయడం, జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించడం తెలిసిందే. దీంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరు హాజరవుతారనే చర్చ జరుగుతోంది.

తన ఎన్నిక చెల్లదంటూ వెలువరించిన తీర్పుపై స్టే కోసం వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి.. మరోవైపు, కోర్టు తీర్పు ఆధారంగా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపైనే అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరిలో ఎవరు హాజరవుతారనేది తేలనుంది. 

కోర్టు తీర్పుతో మాజీగా మారిన వనమా వెంకటేశ్వర రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సమావేశాలకు హాజరవ్వాలంటే జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుందని వివరించారు. జలగంతో ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు. ఈ విషయంపై తన నిర్ణయాన్ని స్పీకర్ పెండింగ్ లో పెడితే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇద్దరిలో ఎవరికీ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.


More Telugu News