కపిల్‌దేవ్ ‘గర్వం’ వ్యాఖ్యలపై స్పందించిన రవీంద్ర జడేజా

  • జట్టులో సునాయాశంగా ఎవరికీ అవకాశం రాదన్న జడేజా
  • అందరూ నూటికి నూరుశాతం శ్రమిస్తారన్న ఆల్‌రౌండర్
  • మెగా టోర్నీల్లో ప్రయోగాలకు అవకాశం ఉండదనే విండీస్‌పై చేశామని వెల్లడి
విపరీతంగా వచ్చి పడుతున్న డబ్బు వల్ల ఆటగాళ్లలో అహం పెరిగిందన్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ వ్యాఖ్యలపై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. ఇక్కడ ఎవరికీ ఎలాంటి పొగరు లేదని స్పష్టం చేశాడు. సునాయాసంగా ఎవరికీ అవకాశం రాదని, అందరూ వందశాతం కష్టపడతారని అన్నాడు. అయితే, ఓడిపోయినప్పుడే వారి ప్రదర్శనపై ప్రశ్నలు వస్తాయని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు నేడు విండీస్‌తో విజేతను తేల్చే చివరి వన్డే ఆడనుంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు, రెండో వన్డేలో అంతే దారుణంగా ఓటమి పాలైంది. దీంతో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో జడేజా మాట్లాడుతూ.. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు ముందు తాము ఆడే చివరి వన్డే సిరీస్ ఇదేనని పేర్కొన్నాడు. కాబట్టే ప్రయోగాలకు వేదికగా చేసుకోవాల్సి వచ్చిందన్నాడు. మెగా టోర్నీల్లో ప్రయోగాలకు అవకాశం ఉండదని అన్నాడు. రెండో వన్డేల్లో ఇద్దరు సీనియర్లు లేకుండానే బరిలోకి దిగామని, ఈ మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా నష్టం ఉండదనే ఉద్దేశంతోనే మార్పులు చేసినట్టు పేర్కొన్నాడు.  ఏం చేయాలో కెప్టెన్‌కు, మేనేజ్‌మెంట్‌కు తెలుసన్నాడు. ప్రతీ మ్యాచ్ ఆడాలని తనకు కూడా ఉంటుందని చెప్పాడు. అయితే, జట్టు అవసరాలను బట్టి కొత్త ఆటగాడిని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా,  జడేజా కనుక మరో ఆరు వికెట్లు తీస్తే వన్డేల్లో 2 వేల పరుగులతోపాటు 200 వికెట్లు తీసుకున్న కపిల్‌దేవ్ సరసన నిలుస్తాడు.


More Telugu News