బీఆర్ఎస్‌కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు: రఘునందనరావు

  • 2014 నుండి ఒక్క అసెంబ్లీ సెషన్ కూడా 30 రోజులు లేదన్న ఎమ్మెల్యే
  • బీజేపీ మినహా అన్ని పార్టీలు బీఆర్ఎస్ మిత్రపక్షాలేనని వ్యాఖ్య
  • రైతు రుణమాఫీ కోసం ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని కాంగ్రెస్‌కు హితవు
బీఆర్ఎస్‌కు వచ్చే అసెంబ్లీ సమావేశాలే చివరివి కానున్నాయని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. 2014 నుండి తెలంగాణ ఒక్క అసెంబ్లీ సెషన్ కూడా కనీసం 30 రోజుల పాటు జరగలేదని విమర్శించారు. కనీసం ఇప్పుడైనా నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. చర్చలకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు బీఆర్ఎస్‌కు మిత్రపక్షాలే అన్నారు.

హైదరాబాద్ సహా తెలంగాణలో వరదలు, నగరంలో ట్రాఫిక్ తదితర అంశాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై సభలో ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. తెలంగాణలో మైనార్టీ బంధు ప్రకటించినప్పుడు, బీసీ బంధు ఎందుకివ్వరని నిలదీశారు. ఎన్నికల్లో అక్రమ కేసులు ఉన్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌లను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.

రైతులకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ బ్యాంకుల ముందు ధర్నా చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. రుణమాఫీపై చిత్తశుద్ధి ఉంటే ప్రగతి భవన్ ముందు, ఆర్థిక మంత్రి ముందు ధర్నా చేయాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను తిట్టినట్లు చేస్తా అన్నట్లుగా ఉందన్నారు.


More Telugu News