వీడియో కాల్ లో వలువలు విప్పి... టెక్కీ నుంచి రూ.1.14 కోట్లు వసూలు చేసిన మాయలాడి

  • మోసగత్తె చేతిలో బ్లాక్ మెయిల్ కు గురైన టెక్కీ
  • మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా యువతితో పరిచయం
  • ఫోన్ చేసి నగ్నంగా మారిన యువతి
  • వీడియో క్లిప్పింగ్ పంపించి బెదిరింపులు
బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ... మాయలాడి వలలో చిక్కుకుని రూ.1 కోటికి పైగా సమర్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ యాప్ లో పరిచయమైన యువతితో ఓ వీడియో కాల్ అతడికి దిమ్మదిరిగే షాకిచ్చింది. 

అసలేం జరిగిందంటే... సన్నీ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి బ్రిటన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం బెంగళూరులోని కేఆర్ పురం. 41 ఏళ్ల సన్నీ ఇటీవల ఆఫీసు పనిమీద బెంగళూరు వచ్చాడు. ఈ సందర్భంగా ఓ మ్యాట్రిమోనియల్ యాప్ లో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. అదే యాప్ లో రిజిస్టర్ అయిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. 

ఇరువురి మధ్య కొన్నిరోజుల పాటు చాటింగ్ ద్వారా సంభాషణ జరిగింది. సన్నీ, ఆ యువతి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తన తండ్రి చనిపోయాడని, తల్లితో కలిసి ఉంటున్నానని  ఆ యువతి సన్నీకి చెప్పింది. అంతేకాదు, నిన్ను పెళ్లాడాలని ఉంది అంటూ సన్నీకి తెలియజేసింది. 

జులై 2వ తేదీన... ఆ యువతి సన్నీకి ఫోన్ చేసి తల్లికి మందులు కొనాల్సి ఉందని, రూ.1500 కావాలని కోరింది. జులై 4న సన్నీకి ఫోన్ చేసిన ఆ యువతి వీడియో కాల్ లో నగ్నంగా మారింది. ఆ సంభాషణ అంతా సన్నీకి తెలియకుండా రికార్డ్ చేసింది. అనంతరం, ఆ వీడియో క్లిప్పింగ్ ను సన్నీకి పంపిన యువతి బెదిరింపులకు పాల్పడింది. 

తనకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను సన్నీ తల్లిదండ్రులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో హడలిపోయిన ఆ టెక్కీ రూ.1.14 కోట్లు ఆ మాయలాడి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అయినప్పటికీ ఆమె డబ్బు కోసం బెదిరిస్తూ ఉండడంతో, చివరికి ఈ విషయాన్ని అతడు పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. 

ఆమె బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేసే సమయంలోనే ఆమె అసలు పేరు తెలిసిందని సన్నీ వాపోయాడు. నకిలీ వివరాలతో మ్యాట్రిమోనియల్ యాప్ లో రిజిస్టర్ అయిన విషయాన్ని గుర్తించలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. 

దీనిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ఆ కిలాడీ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన వలలో చిక్కుకున్న వారి నుంచి డబ్బు గుంజడానికే ఆ యువతి ఫేక్ ప్రొఫైల్ తో మ్యాట్రిమోనియల్ యాప్ లో రిజిస్టర్ అయ్యుంటుందని పోలీసులు తెలిపారు. 

కాగా, ఆ సన్నీ ఖాతా నుంచి ఆ యువతి ఖాతాల్లోకి బదిలీ అయిన డబ్బులో రూ.84 లక్షలను పోలీసులు స్తంభింపజేశారు. ఆ యువతి రూ.30 లక్షలు ఖర్చు చేసినట్టు గుర్తించారు. 

దీనిపై బెంగళూరు వైట్ ఫీల్డ్ డీసీపీ ఎస్.గిరీశ్ స్పందిస్తూ... ప్రత్యక్ష పరిచయం లేకుండా, ఆన్ లైన్ లో పరిచయం అయిన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఫోన్ చేసి అశ్లీలంగా మాట్లాడినా, వీడియో కాల్ లో అసభ్యకరంగా ప్రవర్తించినా అటువంటి కాల్స్ ను కొనసాగించకపోవడమే మంచిదని తెలిపారు.


More Telugu News