తోడేలులా కనిపించేందుకు రూ.20 లక్షలు ఖర్చు చేశాడు!

  • జపాన్ జాతీయుడి వింత కోరిక
  • ఏరికోరి తోడేలు సూట్ తయారు చేయించుకున్న ఇంజినీర్
  • కేవలం ఇంట్లోనే తోడేలు సూట్ ధరిస్తున్న వైనం
  • ఆ సూట్ ధరిస్తే అచ్చం తోడేలులా కనిపిస్తున్న వ్యక్తి
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటారు! ఈ జపాన్ జాతీయుడు కూడా ఆ కోవలోకే వస్తాడు. అతడి పేరు టోరు ఉయిడా. 32 ఏళ్ల టోరు ఉయిడా వృత్తిరీత్యా ఓ ఇంజినీర్. తోడేలులా కనిపించాలన్నది అతడి చిన్ననాటి కల. 

ఆ కల నెరవేర్చుకునేందుకు అతడు రూ.20 లక్షలు ఖర్చు చేశాడు. అచ్చం తోడేలును పోలి ఉండేలా ప్రత్యేకంగా ఓ సూట్ తయారు చేయించుకున్నాడు. ఆ సూట్ ధరిస్తే ఎవరైనా సరే తోడేలులానే కనిపిస్తారు. జెప్పెట్ వర్క్ షాప్ అనే మోడలింగ్ సంస్థ ఈ తోడేలు సూట్ ను రూపొందించింది. 

సాధారణంగా జెప్పెట్ వర్క్ షాప్ సినిమాలు, టీవీ సిరీస్ లకు అవసరమైన కాస్ట్యూమ్స్ ను తయారు చేస్తుంటుంది. ఈ సంస్థను సంప్రదించిన టోరు ఉయిడా తనకు తోడేలు కాస్ట్యూమ్ కావాలని కోరాడు. అతడి నుంచి ఆర్డర్ స్వీకరించిన జెప్పెట్ సంస్థ 7 వారాల వ్యవధిలో ఆ సూట్ తయారు చేసింది. అందుకోసం ప్రత్యేకంగా నలుగురు ఉద్యోగులు ఎంతో శ్రమించారు. 

అయితే, అంత ఖర్చు పెట్టి తయారు చేయించుకున్న తోడేలు సూట్ ను కేవలం ఇంట్లోనే ధరిస్తానని టోరు ఉయిడా చెబుతున్నాడు. ఆ సూట్ ను బయటికి వెళ్లేటప్పుడు ధరిస్తే అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఈ తోడేలు సూట్ ధరించి రిలాక్స్ అవుతానని, బాధలన్నీ మర్చిపోతానని వెల్లడించాడు. 

ఈ సూట్ ధరిస్తే తానొక మనిషిని అనిపించదని టోరు ఉయిడా తెలిపాడు. ఈ లోకంతో సంబంధం లేన్నట్టుగా అన్ని సమస్యల నుంచి విముక్తి కలిగినట్టు భావిస్తానని వివరించాడు. అంతేకాదు, ఆ తోడేలు సూట్ ధరిస్తే తానెంతో శక్తిమంతుడ్ని అనే భావన కలుగుతుందని చెప్పాడు.


More Telugu News