ప్రతిపక్ష పార్టీలే పార్లమెంటులో చర్చ జరగకుండా పారిపోతున్నాయి: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్

  • సభకు వచ్చి.. చర్చలో పాల్గొనాలన్న మంత్రి అనురాగ్ ఠాకూర్
  • ప్రతిపక్షాలు కోరిన అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
  • పార్లమెంటుకు ఎన్నిక కావడం వల్ల ప్రయోజనం ఏంటని నిలదీత 
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ ఒక్కరోజు సజావుగా సాగడం లేదు. మణిపూర్‌‌ హింసపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. దీంతో రోజూ ఉభయ సభలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. 

పార్లమెంట్ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌‌పై చర్చించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలే పార్లమెంటులో చర్చ జరగకుండా పారిపోతున్నాయని మండిపడ్డారు. వీధుల్లో నిరసనలు చేయాలని కోరుకుంటే.. పార్లమెంటుకు ఎన్నిక కావడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. దయచేసి సభకు వచ్చి.. చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రతిపక్షాలు కోరిన అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పారిపోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 

మరోవైపు మణిపూర్‌‌లో పర్యటించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు.. పశ్చిమ బెంగాల్‌కు ఎందుకు వెళ్లలేదని అనురాగ్ ఠాకూర్ నిలదీశారు. గతంలో యూపీఏ హయాంలోనూ మణిపూర్‌‌లో ఆరు నెలలపాటు హింస చెలరేగిందని చెప్పారు. అయినా అప్పటి ప్రధాని, కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని విమర్శించారు.


More Telugu News