డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట!
- డీకేపై నమోదైన అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తుపై స్టే ఇచ్చిన హైకోర్టు
- దీన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన కేంద్ర దర్యాప్తు సంస్థ
- జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
డీకే శివకుమార్‌పై నమోదైన అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 10న స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. సోమవారం విచారణ సందర్భంగా సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. సీబీఐకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నా.. హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందని చెప్పారు. స్పందించిన ధర్మాసనం ఈ అంశం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద పెండింగ్‌లో ఉందని, తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని హైకోర్టును కోరేందుకు సీబీఐకి స్వేచ్ఛ ఇస్తున్నట్లు చెప్పింది.