టీమిండియా ఆటగాళ్లపై మళ్లీ విరుచుకుపడిన కపిల్ దేవ్!
- ఆటగాళ్లకు చిన్న గాయాలైనా ఐపీఎల్ ఆడతారన్న కపిల్
- చిన్న గాయాలైతే టీమిండియాకు మాత్రం ఆడకుండా విశ్రాంతి తీసుకుంటారని విమర్శ
- ఐపీఎల్ గొప్పదే కానీ పాడు చేస్తుందని వ్యాఖ్య
- బుమ్రా వరల్డ్ కప్ ఆడకుంటే.. అతడిపై టైమ్ వృథా చేసినట్లేనని మండిపాటు
- క్రికెట్ బోర్డులోనే ఏదో లోపం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి టీమిండియా ఆటగాళ్ల తీరుపై విమర్శలు కురిపించారు. ఈసారి ఆటగాళ్ల నిబద్ధతపై ఆయన ప్రశ్నలు సంధించారు. ‘ది వైర్’ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడాదికి 10 నెలలు ఆడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోవాలి. ఐపీఎల్ గొప్పది. కానీ ఇదే సమయంలో లీగ్ మిమ్మల్ని పాడు చేస్తుంది. ఎందుకంటే చిన్న గాయాలైనా మీరు ఐపీఎల్ ఆడతారు. కానీ అవే చిన్న గాయలైనప్పుడు.. టీమిండియాకు మాత్రం ఆడరు. విశ్రాంతి తీసుకుంటారు. నేను దీని గురించి చాలా ఓపెన్‌గా చెబుతున్నా” అని విమర్శించారు.
‘‘నిజానికి ఆటగాళ్ళు ఎంత వరకు ఆడాలనేది క్రికెట్ బోర్డు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీకు వనరులు, డబ్బు ఉన్నాయి.. కానీ మూడు, నాలుగు క్యాలెండర్లు లేవు కదా. క్రికెట్ బోర్డులో ఏదో లోపం ఉంది” అని కపిల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘బుమ్రాకి ఏమైంది? అతడు ఎంతో నమ్మకంతో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. కానీ అతడు వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లేదా ఫైనల్‌లో లేకుంటే.. మనం అతడి కోసం సమయాన్ని వృథా చేసినట్లే. రిషభ్ పంత్ గొప్ప క్రికెటర్. అతడు ఉండి ఉంటే.. మన టెస్టు క్రికెట్ మరింత మెరుగ్గా ఉండేది” అని కీలక వ్యాఖ్యలు చేశారు.