ఏపీలో మహిళలకు రక్షణ లేదు: బోండా ఉమ

  • వాలంటీర్లతో వ్యక్తిగత సమాచారం సేకరించిందన్న ఉమ 
  • ఆ సమాచారం ఇప్పుడు చోరీకి గురైందని ఆరోపణ 
  • బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముకూ గ్యారెంటీ లేదని వ్యాఖ్య 
వివిధ పథకాల పేరు చెప్పి వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం సేకరించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ వ్యూహంతో జగన్ సర్కారు ఈ సమాచారం సేకరించిందని ఆరోపించారు. ఈ సమాచారం చోరీకి గురైందని, దీంతో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. ఈమేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో బోండా ఉమ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల గోప్యతకు ధన, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 

రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 5.5 కోట్ల మంది డేటాను దుర్వినియోగం చేసి వైసీపీ బ్యాచ్ ఇప్పటికే రూ.50 వేల కోట్ల పేదల భూములు కాజేసిందని బోండా ఉమ ఆరోపించారు. పథకాల పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు ప్రజల వేలిముద్రలు కూడా సేకరించారని, దీంతో బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ పెద్దల అక్రమాలను ప్రశ్నించేవారిని, ప్రభుత్వాన్ని నిలదీసేవారిని ఆ తర్వాత టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బోండా ఉమ ఆరోపించారు.


More Telugu News