తెలంగాణలో రేపు భారీ వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

  • పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
  • సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
  • గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంకా లోటు వర్షపాతమే
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం (ఆగస్టు 1) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల నమోదైన వర్షపాతం.. జన్నారంలో 4 సెంటీమీటర్లు, మేడ్చల్ లో 3.8 సెం.మీ., కాగజ్ మద్దూర్ లో 3.5 సెం.మీ. బీబీనగర్ లో 2.8 సెం.మీ., విశ్వనాథ్ పూర్ లో 2.7 సెం.మీ., లక్ష్మిసాగర్ లో 2.7 సెం.మీ., కేశవరంలో 2.6 సెం.మీ., ఆలియాబాద్ లో 2.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. 

కాగా, వారం రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా గతేడాదితో పోలిస్తే ఇంకా లోటు వర్షపాతమే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత సీజన్ లో వర్షాలు 19 శాతం తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కిందటేడాది జూన్ నుంచి జులై 30 వరకు రాష్ట్రంలో 687.1 మిల్లీమీటర్ల వర్షాలు పడగా.. ఈ ఏడాది అదే కాలానికి 559.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని వివరించింది.


More Telugu News