ఆసక్తికరంగా యాషెస్ చివరి టెస్టు... ఆసీస్ టార్గెట్ 384 రన్స్

  • ఓవల్ మైదానంలో మ్యాచ్
  • రెండో ఇన్నింగ్స్ లో 395 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
  • లక్ష్యఛేదనలో ఆసీస్ కు శుభారంభం
  • నేడు నాలుగో రోజు ఆటలో లంచ్ వేళకు ఆసీస్ స్కోరు 75-0
  • విజయానికి 309 పరుగుల దూరంలో కంగారూలు
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఫలితం దిశగా సాగుతోంది. 

ఆటకు నేడు నాలుగో రోజు కాగా... ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 395 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యాన్నుంచింది. దాంతో, రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ మొదలుపెట్టిన కంగారూలు లంచ్ వేళకు వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేశారు. 

ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 30, ఉస్మాన్ ఖవాజా 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 309 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా ఒకటిన్నర రోజు సమయం ఉండడంతో మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

ఎందుకంటే... ఈ మ్యాచ్ ను డ్రా చేసుకున్నా చాలు... యాషెస్ సిరీస్ ఆసీస్ వశమవుతుంది. అలా కాకుండా, ఈ టెస్టులో ఇంగ్లండ్ నెగ్గితే సిరీస్ డ్రా అవుతుంది. 5 టెస్టుల యాషెస్ సిరీస్ లో తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఆతిథ్య ఇంగ్లండ్... ఆ తర్వాత అద్భుత రీతిలో పుంజుకుని మూడో టెస్టును గెలిచింది. ఇంగ్లండ్ జట్టు నాలుగో టెస్టులోనూ విజయం ముంగిట ఉండగా, వరుణుడి కారణంగా ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.


More Telugu News