టీఎఫ్‌సీసీ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

  • సభ్యులు దేని కోసం పోటీపడుతున్నారో అర్థం కావడం లేదన్న తమ్మారెడ్డి
  • ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తోందని వ్యాఖ్య
  • ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్
  • అధ్యక్ష బరిలో దిల్‌రాజు, సి.కల్యాణ్
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు దేనికి పోటీపడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోషపడాలో.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం లేదని అన్నారు. తాను కూడా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని, చాలా ఎన్నికలను చూశానని పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. 

టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. అధ్యక్ష పదవి కోసం దిల్‌రాజు, సి.కల్యాణ్ పోటీ పడుతున్నారు.


More Telugu News