తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు

  • ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు
  • కంటి చూపునకు ప్రమాదం లేదంటున్న వైద్యులు
  • ఈసారి కేసులు పెరుగుతున్నాయని వెల్లడి
తెలంగాణలో కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్క సరోజనీదేవి ఆసుపత్రికే రోజుకు ముప్పై నలభై మంది బాధితులు వస్తున్నారని వైద్యులు చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వైరస్ ఇన్ ఫెక్షన్లలో కళ్ల కలక కూడా ఒకటని అన్నారు. వర్షాల వల్ల గాలిలో తేమ, చెమ్మ కారణంగా వైరస్ లు, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వ్యాపిస్తుంటాయని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రికి వస్తున్న బాధితులలో ఎక్కువ మందికి అడెనో వైరస్ వంటి ప్రత్యేక వైరస్ కారణమని పరీక్షల్లో తేలిందన్నారు.

కళ్ల కలక బాధితులకు వైద్యుల సూచనలు..
వైరస్ వల్ల వచ్చే ఫోలిక్యులర్ కళ్ల కలకతో కంటి చూపునకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ సీజన్ లో కళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. బయట నుంచి వచ్చాక గోరువెచ్చని నీటితో కళ్లు, ముఖం కడుక్కోవాలని సూచించారు. తీవ్రమైన కళ్ల కలక (ఎపిడమిక్ కెరటో కన్జంక్టివైటిస్) విషయంలో అప్రమత్తత అవసరమని డాక్టర్లు చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలంలో దృష్టి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కళ్ల కలక మరీ బాధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

సాధారణ లక్షణాలు..
కళ్లు ఎరుపెక్కడం, దురద, కాంతిని చూడలేకపోవడం, జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలు కళ్ల కలక బాధితులలో కనిపిస్తాయని వైద్యులు చెప్పారు. ఇది అంటువ్యాధి అని, ఇంట్లో ఒకరికి సోకితే వెంటనే మిగతా వారికీ అంటుకుంటుందని హెచ్చరించారు. దురదగా ఉందని కళ్లు నలపడం, సొంత వైద్యం చేసుకోవడం చేయొద్దని, వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు.


More Telugu News